Friday, November 22, 2024

కరోనా అని సందేహంగా ఉంటే.. ఈ నంబరుకు కాల్ చేయండి

కరోనా లక్షణాలతో బాధపడుతూ కరోనా ఉందేమోనని సందేహంగా ఉంటే ప్రజలు వెంటనే 08542-241165 నంబరుకు ఫోన్ చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఈ నంబరుకు కాల్ చేసి సంబంధిత సిబ్బందికి సమాచారం ఇస్తే అంబులెన్సు ఇంటికి వస్తుందని, వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే అదే అంబులెన్సులో ఆస్పత్రిలో చేరుస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మొబైల్ క్లినిక్ బెస్ట్  అంబులెన్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచంలో మొత్తం 40 శాతం జనాభాకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ మన రాష్ట్రం నుండే సరఫరా అవుతుందని, మన రాష్ట్ర ప్రజలకు అవసరమైన మేరకు వైద్య సేవలు అందించి ప్రజలను కాపాడుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు.

ఈ క్రమంలో కొంతమంది మీడియాలోనూ, మరికొంతమంది సామాజిక మాధ్యమాలలో కరోనా పరీక్షలు చేసే కిట్లు, అవసరమైన మోతాదులో ఆక్సిజన్ అందుబాటులో లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు మరింత భయాందోళనలకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించడానికి పోలీసు యంత్రాంగం వెనకాడబోదని మంత్రి హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాలతో కూడి ఉన్నది కావడం వల్ల ఇక్కడే ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి, అందుకు చర్యలు చేపట్టిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement