Friday, November 22, 2024

మంత్రి కొడాలి నానికి శ్రీనివాస్‌గౌడ్ కౌంటర్

ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా మంత్రి కొడాలి నానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కొడాలి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని, ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. అందుకైనా కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆ ఆశలకు పక్క రాష్ట్రం గండికొడుతోందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని.. జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ఆర్ అని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో వైసీపీ నేతలు మంత్రులు విరుచుకుపడుతున్నారు. దానికి సంబంధించి మంత్రుల మధ్య కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడినవారు వైఎస్ఆర్ అని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయని కొడాలి నాని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకోవాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీకి కేసీఆర్ పన్నులు ఎగ్గొడుతున్నారన్న రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement