తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే తాము వ్యతిరేకం అని, ఏపీ ప్రజలకు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుపోవాలన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు చెప్పారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ధ్వజమెత్తారు.
పాలమూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ను కాదని పెన్నా నదికి నీటిని తరలించడం మంచిది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించరని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు తెలిపారు.
తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారని, ఏపీ సీఎం జగన్, మంత్రులు మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తెలంగాణలో వ్యాపారాలు అడ్డుకుంటున్నారని తెలంగాణలోని ఏపీ ప్రజలు ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలకు తాము ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని నిలదీశారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారా? అని నిలదీశారు. తెలంగాణలోని కాలనీలు, పార్కులకు పెట్టిన ఆంధ్రా వారి పేర్లను తామేమైనా తొలగించామా? అని అడిగారు. వేలాది మంది మరణాలకు నాటి ఆంధ్ర నాయకులే కారణమన్నారు.