మహబూబ్ నగర్ : పాలకొండ అభయాంజనేయుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా.వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున మహబూబ్ నగర్ నూతన కలెక్టరేట్ సమీపంలోని పాలకొండలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రథోత్సవం, ఊయల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురవీధుల గుండా సాగిన రథోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. బాణసంచా వెలుగులతో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది.
స్థానికులతో కలిసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎంతో వెనకబడిన పాలకొండ దశ దిశ మారిపోయిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు మన పండుగలు నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఒకప్పుడు పాలకొండ అంటే ఎవరికీ తెలియదు, ఓ మారుమూల గ్రామంగా ఉండేదని, ఇప్పుడు చెంతనే జాతీయ రహదారి, సమీపంలోనే బైపాస్, వీటి పరిధిలోనే కలెక్టరేట్ నిర్మాణంతో ఎంతో డిమాండ్ ఏర్పడిందన్నారు. ఒకప్పుడు ఎంతో వెనకబడి, మారుమూల గ్రామంగా ఉన్న పాలకొండ నేడు హైదరాబాద్ లోని మణికొండను తలపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. దగ్గర్లోనే ఐటీ పార్కు ఏర్పాటు కావడం వల్ల స్థానికులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని ఉద్యోగాలు చేసి సాయంత్రానికే ఇంటికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గతంలో పంటలు పండక అన్నదాతలు ఆవేదన చెందే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, భూముల విలువ పెరగడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారు. భవిష్యత్ మహబూబ్ నగర్ ఇంకా అత్భుతంగా అవ్వాలని, అభయాంజనేయుడి దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఐక్యమత్యంతో జీవించాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, స్థానిక కౌన్సిలర్ మూస నరేందర్, తదితరులు పాల్గొన్నారు.