సీఎం కేసిఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్వాడీలు అందిస్తున్న సేవలు గుర్తించి ముఖ్యమంత్రి కేసిఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారని గుర్తు చేశారు. వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పిఆర్సీలో పెట్టారని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లాలో ఆధునీకరించిన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. గిరిపోషణ, పోషణ్ అభియాన్ లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అవార్డులు కూడా రావడం మన అంగన్వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు అన్నారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమం ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లితండ్రి వలె ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోషకాహారాన్ని అందించడం ద్వారా రక్తహీనతను నివారించేందుకు గిరిపోషణ అమలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కేసిఆర్ న్యూట్రిషియన్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 1,25,000 లబ్దిదారులలో రక్తహీనత నివారణ కోసం ఈ కిట్ అందించనున్నామన్నారు.
ఆరోగ్య పరంగా మహిళలు, శిశువులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అంగన్వాడీలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. కేసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల బాల్య వివాహాలు తగ్గాయని, పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా మారిందన్నారు.