Saturday, November 23, 2024

సీఎం కేసిఆర్ నిర్ణయంతో వరి కోతలు వేగవంతం

రాష్ట్ర రైతాంగం కొద్ది రోజులుగా పడుతున్న ఆందోళనకు సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి వడ్లు కేంద్రం కొనలేని పరిస్థితుల్లో సీఎం కేసిఆర్.. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని ప్రకటించారని అన్నారు. కనీస మద్దతు ధర ఇస్తుందని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యాసంగిలో తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం షరతులు పెట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ముందే ఊహించి యాసంగిలో తక్కువ వరి వేయాలని సీఎం కేసిఆర్ రైతులను కోరారని గుర్తు చేశారు. ఈసారి 20 లక్షల ఎకరాల్లో తక్కువ వరి వేశారని తెలిపారు. అయినా ఈ ధాన్యం కూడా కొనమని కేంద్రం అనడంతో… రైతులకు అండగా  నిలబడాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం పట్ల సీఎం కేసిఆర్ కి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈసారి వేసిన పంటలో విత్తనాలు, సొంత అవసరాలకు పోను.. ఎంత అమ్మకానికి వస్తుంది అంచనా వేసి ఆ ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సీఎం కేసిఆర్ నిర్ణయంతో వరి కోతలు ఇపుడు మరింత వేగంగా జరుగుతాయన్నారు. 1960 రూపాయల కనీస మద్దతుకి కొనుగోలు చేస్తాం, తక్కువ ధరకు అమ్మాల్సిన పని లేదన్న సీఎం కేసిఆర్ నిర్ణయం వల్ల రైతులు ఆందోళన పడొద్దని సూచించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్లు కూడా రైతులకు సంపూర్ణంగా సహకరించాలన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేయడం, ఆలస్యం చేయడం, ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే… ఆ విధంగా ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోవాలన్నారు. రైతు 6 నెలల కష్టం చాలా విలువైందన్న మంత్రి సత్యవతి… కొనుగోలు విషయంలో అందరూ కలిసి ఉమ్మడి బాధ్యతగా పని చేయాలన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే డబ్బులు వస్తాయని సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారని, దీని గైడ్ లైన్స్ వెంటనే వస్తాయని వెల్లడించారు. రైస్ మిల్లర్లతో కూడా సమావేశం పెట్టి వారితో చర్చిస్తాం అని అన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారని, వారి సేవలు పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement