ఖమ్మం నగరం, (ప్రభ న్యూస్): దివ్యాంగులకు పింఛన్ల పెంపు నిర్ణయంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎంగా కేసీఆర్ నిలిచిపోతారన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప నిర్ణయం అన్నారు.
శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని మంత్రి పువ్వాడ చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున పదేళ్ళలో రూ.10310.36 కోట్ల రూపాయలను వారికి పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు అందించడం జరుగుతుందని చెప్పారు. అయితే వచ్చే నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4116 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలిఅన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.