Friday, November 22, 2024

Minister Puvvada: కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల ఫలితం… కనిష్ఠ జిడిపి, గరిష్ఠ నిరుద్యోగం

అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో 91,142 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ సీఎం కేసిఆర్ చేసిన కీలక ప్రకటన సీఎం పరిపాలన దక్షతకు నిదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన వెలువడించిన సీఎంకు నిరుద్యోగుల పక్షాన మంత్రి శ్రీ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏడేళ్ల పాలనలో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు కనిష్ఠ జీడీపీ, గరిష్ఠ నిరుద్యోగం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ విధానాన్ని త‌ప్పుగా అమ‌లు చేయ‌డం, క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో మొండి చేయి చూప‌డం వీటి వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంద‌ని ఆరోపించారు. వీటివ‌ల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి, తాండ‌వం చేస్తున్నా దానిపైన ప్ర‌ధాని మోదీ నోరు విప్ప‌ర‌ని మంత్రి దెప్పిపొడిచారు.

జాతీయత, దేశభక్తి పేరుతో దేశ సార్వభౌమ త్వానికే భంగకరంగా ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుపరం చేయటం మోదీ ప్రభుత్వ ప్రత్యేకతని, ఆశ్రిత పక్షపాతం, అవినీతిలో అగ్రస్థానమేనని అన్నారు. సమర్థ, స్వచ్ఛ, అవినీతిరహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ క్రమంలో ఏటా 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న 75 లక్షల కోట్ల నల్లధనం తిరిగి తెస్తామని, ప్రతి ఖాతాలో 15 లక్షలు ప్రజలకు జమజేస్తామని మోదీ చెప్పిన మాటలు ప్రచార ఆర్భాటాలేనని తేలిపోయినట్టు మంత్రి చెప్పారు. ప్రజల ఖాతాల్లోకి దమ్మిడి కూడా రాలేదన్నారు. స్వచ్ఛ భారత్‌ పేరుతో ప్రచార హోరే కానీ పేరుకుపోయిన చెత్త అలాగే మిగిలిపోయిందన్నారు. స్వచ్ఛ భారత్‌ సెస్‌’ పేరుతో ఏటా రూ.5 వేల కోట్లు జనాల చేతి చమురు వదులుతున్నదని అంబానీ, అదానీల ఆస్తులు నాలుగు రెట్లు పెరిగిన అణగారినవర్గాల ఆస్తి ఇసుమంతైనా పెరగలేదన్నారు, పై పెచ్చు 25 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారు కానీ మోదీకి మాత్రం సూట్లు మార్చడం, ఎక్కే విమానం దిగే విమానంలా ఈ కాలం గడిచిపోయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యిందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని తెలిపారు. జాతీయ నిరుద్యోగిత రేటు 6.57 శాతంగా ఉందని బీజేపీ పాలిత హర్యానాలో అత్యధికంగా 23.4 శాతం ఉండగా, రాజస్థాన్‌ 18.9 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని 2022 జనవరికి సంబంధించిన నిరుద్యోగిత రేటు నివేదికను కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం బీజేపీ పాలన ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు వేగంగా తగ్గుతున్నదని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటంతో అందరికీ పని దొరుకుతున్నదన్నారు. కరోనా సమయంలో 2020 మే నెలలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 14.7 శాతం ఉన్నదని ఆ తర్వాత మూడు దశల్లో కరోనా వెంటాడినా రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గటం తెరాస ప్రభుత్వ సీఎం కేసిఆర్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోకి ఉత్పాదక, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని దీంతో ఉపాధి కల్పనలో రాష్ట్రం పురోగతి సాధిస్తున్నట్టు మంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement