హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు మారింది. కుట్ర కేసుతో సంబంధం ఉన్న నిందితులను కోర్టు అనుమతితో పోలీసులు నాలుగు రోజులు కస్టడీ విచారణ జరిపినప్పటికీ ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో మూడు రోజులకే నిందితులను కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించాల్సి వచ్చిందని అంటున్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తులు రూ. 15 లక్షల సుఫారీ ఇచ్చేందుకు సిద్దమయ్యారని చెప్పిన పోలీసులు అందుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కానీ, ఆధారాలను కానీ సేకరించలేకపోయారు. అంతేకాకుండా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టలేకపోయారు.
దీంతో ఈ కేసు అనుకున్నంత వేగంగా దర్యాప్తు సాగదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడుగురి కస్టడీ విచారణలో పోలీసులు రాబట్టిన సమాచారం ఒక్కటే అని తేలింది. తమ ఉపాధిని దెబ్బతీసేలా మంత్రి వేధింపులకు పాల్పడటం, ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పెట్టాడని, పూర్తిగా అణచి వేశాడని, తద్వారా వ్యాపారాలు దెబ్బతిన్నాయని మాత్రమే నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు ప్రకటించినట్లుగా సుఫారీ ఇచ్చి హత్య చేయించేంత స్థోమత తమకు లేదని, రూ. 15 కోట్ల మేర ఆస్తులే తమకు లేవని పదే పదే చెప్పడంతో పోలీసులు నెత్తి పట్టుకున్నారు. కస్టడీ విచారణ పూర్తిగా వీడియో చిత్రీకరణలో జరగడం, సాయంత్రం వేళల్లో నిందితులందరికీ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించడం కూడా పోలీసుల విచారణకు కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.
ఈ కేసులో మొదటి నుంచీ పోలీసుల తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో తప్పులు దొర్లడం, నిందితులను అరెస్టు చూపించిన సమయంలో సీపీ స్టీఫెన్ రవీంధ్ర మీడియాకు అసంపూర్ణంగా సమాచారం తెలపడం, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలను దాట వేశారు. నిందితుల నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్న సీపీ అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేకపోయారు. అంతేకాకుండా నిందితులలో నలుగురిని సుచిత్ర ప్రాంతంలో అరెస్టు చేశామని సీపీ తెలపగా, నిందితుల కుటుంబసభ్యులు మాత్రం అంతకు ముందే మహబూబ్‌నగర్ పోలీసులకు కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు చేయడం, తర్వాత రాజకీయ నేతల ప్రకటనలతో అరెస్టులు చూపించడం కూడా అనుమానాలకు తావిచ్చింది. తాజాగా కస్టడీ విచారణలో పోలీసులు స్పష్టమైన సమాచారాన్ని రాబట్టలేకపోవడంతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎక్కడ ముగుస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.