Thursday, November 21, 2024

కేసీఆర్.. నెక్ట్స్ ప్రధాని!

‘తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని కావాలి.. దేశ చరిత్రనే మారుస్తాడు’. ఈ మాట అన్నది మరెవరో కాదు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా నిలిపిన కేసీఆర్.. ప్రధాన మంత్రి అయితే, అసలు దేశంలో సమస్యలే ఉండవని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రి మాల్లారెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి.

తెలంగాణ సీఎంగా మంత్రి కేటీఆర్‌ను ప్రకటించి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఖండించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను మరో పదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే, కేసీఆర్ ప్రధాని కావాలంటూ టీఆర్ఎస్ నేతలు తరచూ  చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది.

ఇదే అంశంపై గతంలో కేటీఆర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని ఎందుకు కాకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘’2003లో మన్మోహన్‌సింగ్‌ ప్రధాని అవుతాడని.. పదేళ్ళు పాలిస్తాడని ఎవరైనా ఊహించారా? 2012లో మోడీ భవిష్యత్‌ ప్రధాని అవుతాడని అనుకున్నారా? రాజకీ యాల్లో ఏదైనా జరగొచ్చు.. అలాంటపుడు కేసీఆర్‌ ఎందుకు ప్రధాని ఎందుకు కారు? 44 సీట్లున్న రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కలగన్నపుడు 16 సీట్లున్న కేసీఆర్‌ ప్రధాని కావాలని ఎందుకు కోరుకోకూడదు? కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వం రావాలని మేం బలంగా కోరుకుంటున్నాం.. వస్తుందని విశ్వసిస్తున్నాం.’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్, బీజేపీలపై ఆధారపడని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. అంతే కాదు, పలు పార్టీల మద్దతు కోసం దేశవ్యాప్తంగా పర్యటించారు. అయితే, పూర్తిస్థాయిలో విజయం కాలేదు. తర్వలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్.. జాతీయ స్థాయిలో మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయ టూర్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాన మంత్రి పదవి కేసీఆర్ మనసులో మాట ఎలా ఉన్నా.. టీఆర్ఎస్ నాయకులు పదేపదే ఈ విషయంమై మాట్లాడడం ఆసక్తి రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement