కేంద్రం పెంచిన పన్నులు, జీఎస్టీ వంటి అంశాలతో విపరీతమైన భారం పెరిగిందని అందుకే ఇక వస్త్ర పరిశ్రమను రన్ చేయలేమని మే1వ తేదీ నుంచి సిరిసిల్ల టెక్ట్స్‌టైల్ పరిశ్రమకు తాళాలు వేశారు. ఈ సంక్షోభం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతోనే అన్న విషయం వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. అయితే.. టెక్ట్స్‌టైల్ పార్కులో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించారు మంత్రి కేటీఆర్. సోమవారం మంత్రి పీఎస్ శ్రీనివాస్ సిరిసిల్లకు చేరుకొని పరిశ్రమ మూసివేతకు దారితీసిన పరిస్థితులపై చేనేత జౌళిశాఖ అధికారులు అశోక్‌రావు, సాగర్ , సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ , టెక్స్టైల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నల అనీల్ , ప్రధాన కార్యదర్శి అంకారపు కిరణ్ తో చర్చలు జరిపారు.
అధికారులతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో మంగళవారం నుంచి టెక్ట్స్‌టైల్ పార్కులో వస్త్రోత్పత్తిని తిరిగి ప్రారంభించాలని యజమానులు నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ చొరవతో రెండు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం లభించింది. రాష్ట్రం అన్నింటిలో సానుకూలంగా స్పందిస్తున్నా కేంద్రం కనికరించకపోవడంతో యూనిట్ల నిర్వహణ భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం 2015 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు రూ .14.66 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించాల్సి ఉండగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా బకాయిలకు మాత్రం మోక్షం లభించకపోవడం.. మరోవైపు తమిళనాడులో మరమగ్గాల పరిశ్రమకు 500యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్ అందిస్తుండగా.. మహారాష్ట్రలో యూనిట్‌కు రూ. 3.50ఉంది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో మాత్రం విద్యుత్ యూనిట్ ధర దాదాపు రూ.7.50 వరకు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమలు నడిపే పరిస్థితులు లేవని పార్క్ ను నిరవధికంగా బంద్ చేశారు.
విద్యుత్ సబ్సిడి చిన్న సమస్య కాగా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమపై పన్ను మీద పన్ను వేస్తున్నది. గతంలో జీఎస్టీ పరిధిలోకి తేవద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా అట్లాగే చేర్చింది. నూలుపై 5 శాతం , రంగులు, రసాయనాల పై 18 శాతం, తయారైన వస్త్రాలపైనా 5 శాతం పన్ను విధించింది. అసలే కుంటుతూ గెంటుతూ నడుస్తున్న టెక్ట్స్‌టైల్ రంగంపై కేంద్రం విధించిన పన్నులు భారంగా మారగా, తాజాగా అదనంగా 7 శాతం పెంచి 12 శాతానికి చేసింది. పెంచిన జీఎస్టీ వల్ల మీటరు బట్టకు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగింది. విధించిన 12 శాతం పన్నుతో కేంద్ర సర్కారుకు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరనుండగా భారం వస్త్ర పరిశ్రమపై పడింది.
చర్చల అనంతరం మంత్రి కేటీఆర్ ఒప్పందం ప్రకారం 2015 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు రూ.14.66 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ విరమిస్తున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. ప్రస్తుతం టెక్స్టైల్ పార్కులో 165 ఇండస్ట్రీయూనిట్లు , 27 కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో 115 యూనిట్లలో 1475 ఆధునిక రాపియర్ మరమగ్గాలపై ఉత్పత్తి జరుగినా పూర్తిస్థాయిలో పరిశ్రమలు కూడా నడవని పరిస్థితి నెలకొనడంతో కేటీఆర్ ఈ పరిశ్రమను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు . తాజాగా విద్యుత్ సబ్సిటీ బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకోవడంతో నేటి నుంచి తిరిగి పరిశ్రమలో వస్త్రోత్పత్తి ప్రారంభం కానుంది.