కరీంనగర్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ కళోత్సవాలు ఇవ్వాల ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ దాకా జరుగనున్న ఈ సంబురాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కళోత్సవాల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలు జరగనున్నాయి.. రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 వరకు సాగే కార్యక్రమాలను ఒకేసారి 20 వేల మందికిపైగా వీక్షించేలా అంబేద్కర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు.
ఇక.. జిల్లా చరిత్ర వైభవాన్ని, తెలంగాణ సంస్కృతులు, జానపదాలు వంటి విభిన్న కళాకృతులను చాటి చెప్పడమే కాకుండా.. వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ కళాప్రదర్శనలు, ఐదు దేశాల నుంచి కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగే కళోత్సవాలకు సినీ నటులు ప్రకాశ్‌రాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఉత్సవాల్లో కేవలం రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని 28 రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 150 కళా బృందాలు పాల్గొననున్నాయి. ఒక్కో బృందంలో 15 నుంచి 18 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.