సద్వినియోగం దిశగా యోచిస్తే వ్యర్థానికి ఓ అర్థముంటుంది. ఆ అర్థం వెనుక ప్రయోజనం దాగి ఉంటుంది. ఖమ్మం పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో అందుబాటులోకి రాబోతున్న మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం అందుకు దర్పణం పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక కేంద్రంగా ప్రత్యేకత చాటుతోంది. రూ.5.48 కోట్లతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు వద్ద ‘మానవ విసర్జితాల శుద్ధీకరణ’ (ఎఫ్‌ఎస్‌టీపీ) కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక శాఖ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఖమ్మం ఆదర్శ నగరంగా అనేక అంశాల్లో ముందంజలో నిలుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. మానవ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో మురుగు (వ్యర్థ)ను శుద్ధి చేసి మొక్కలకు నీరందిస్తూనే స్థానిక అవసరాలను తీర్చేందుకు కృషి చేయనున్నారు.
పట్టణాలు, పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి చేస్తూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ప్రజారోగ్యానికి పరిశుభ్రత అంత్యంత అవసరమని, వ్యర్థాలను కూడా శుద్ధి చేయడం వల్ల పరిసరాలు కలుషితం కాకుండా చూసుకోవచ్చనే ధృడ నిశ్చయంతో ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలితంగా ఈ కేంద్రం అతి త్వరలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం పట్టణంలో నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రంలో అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్‌లో విసర్జితాలను మెథనైజేషన్ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. నీటిని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం మొక్కలు కొరకు వినియోగిస్తారు.