Tuesday, November 26, 2024

KTR: ప్ర‌పంచంలో ఉన్న‌వి రెండే కులాలు

ప్ర‌పంచంలో ఉన్న‌వి రెండు కులాలు మాత్ర‌మే.. పైస‌లు ఉన్నోడు.. పైస‌లు లేనోడు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేవుడు మ‌నిషిని పుట్టించాడు.. ఆ మ‌నిషి కులాన్ని పుట్టించాడని పేర్కొన్నారు.  బేగంపేట‌లో ఏర్పాటు చేసిన అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని తెలిపారు.  ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ఈ విగ్ర‌హాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌రించ‌బోతోంద‌న్నారు. భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డే విధంగా మ్యూజియం, జ్ఞానమందిరం ఏర్పాటు చేస్తున్నాం. ఇది భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలవ‌బోతుంద‌న్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని మాటల్లో చాలా మంది చెప్తారు. కానీ ఆ త‌త్వాన్ని కేసీఆర్ ఆక‌ళింపు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య‌మైంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ మ‌హానుభావుడు అంబేద్క‌రే కార‌ణ‌మ‌ని కేటీఆర్ చెప్పారు.

దేశంలో మ‌న‌షులు క‌లిసి ఉండే అల‌వాటు లేదన్నారు. మ‌తం, కులం పేరుతో విడిపోతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలోని అగ్ర‌వ‌ర్ణాల్లో ఉన్న పేద‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోరన్న మంత్రి కేటీఆర్… ద‌ళితుల్లో, గిరిజ‌నుల్లో డ‌బ్బులు ఉండి పైకి వ‌చ్చిన‌వారి విష‌యంలోనూ ఏం ఇబ్బంది ఉండ‌దన్నారు. అందుకే డ‌బ్బున్న వాడు.. డ‌బ్బు లేని వాడు అనే రెండు విష‌యాలే ప్ర‌ధాన‌మ‌నేది అర్థ‌మైంద‌న్నారు. సృష్టించిన సంప‌ద‌ను స‌మాజంలో స‌మానంగా పంచ‌గ‌లిగితే కుల వ్య‌వ‌స్థను రూపుమాపే అవకాశం ఉంద‌ని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement