సిరిసిల్లలో అపరెల్ పార్కు ఉండాలనేది ఈ ప్రాంత ప్రజలు ఎప్పట్నుంచో కల కంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం పెద్దూర్ అపరెల్ పార్కులో గోకల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపరెల్ పార్కు పెడుతామని మాటిచ్చారు కానీ అమలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేడు దానికి బీజం పడి.. సిరిసిల్ల ప్రజల కల నెరవేరిందన్నారు. ఈ పార్కులో 80 శాతానికి పైగా మహిళలకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బతుకమ్మ చీరలు, గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో నేతన్నల ఆదాయం పెరిగింది అని కేటీఆర్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నామని, ఇక్కడ ఉత్పత్తి చేసే బట్టలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్తాయన్నారు. ఈ పార్కులో వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత బీమా కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. నేతన్నకు చేయూత కార్యక్రమం అమలవుతుందన్నారు. దీని ద్వారా కరోనా కాలంలో 26 వేల కుటుంబాలకు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఇది కూడా చదవండి: ఈటలకు ధీటైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?