సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్న ప్రీమియర్ ఎనర్జీస్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ప్రారంభోత్సంవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సంరద్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో రాష్ట్రానికి 15వేలకు పైగా పరిశ్రమలు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. 2 లక్షల 20 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులను రాష్ట్రం సాధించుకుందన్న కేటీఆర్… ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమని వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామకం చేపడుతున్నామని చెప్పారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఏడేళ్లలో రాష్ర్టానికి 15 వేలకు పైగా పరిశ్రమలు రాగా, సుమారు రూ. 2.20 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 80 శాతానికి పైగా పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
కాగా, హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియస్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తుంది. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్, 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్ల తయారీని కంపెనీ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ, ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన 18 నెలల రికార్డు సమయంలోనే ఈ తయారీ యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తామన్న కంపెనీ.. ఇందులో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే కేటాయిస్తామని ప్రకటించింది. మరో రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచి 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారుచేసేలా తెలంగాణలో విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది.