Thursday, November 21, 2024

మరోసారి మానవతను చాటుకున్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని  ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్ డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్ లైన్ క్లాసులు హాజరయ్యేందుకు అవసరమైన లాప్ టాప్ కొనుగోలు చేయలేని ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకవైపు ఎంచుకున్న తన లక్ష్యం, ఉన్నత చదువు దూరమవుతుందమొనన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నది. ఐశ్వర్య కుటుంబం, పేదరికంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని తాజాగా పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఇప్పటికే తమ కూతురు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనలో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు కేటిఆర్ ముందుకు వచ్చారు. గురువారం వారిని ప్రగతి భవన్ కి ఆహ్వానించి.. రెండు లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. షాద్ నగర్ లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరఫున అందించేందుకు హామీ ఇచ్చారు. అత్యంత పేదరికాన్ని జయించి దేశంలోనే ప్రముఖ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న కూతురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్న కేటీఆర్.. ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ చూపిన ఉదారత పట్ల ఐశ్వర్య రెడ్డి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కూతురుని కోల్పోయిన భాద నుంచి ఇంకా కోలుకోలేని తమ కుటుంబానికి మంత్రి చేసిన సహాయం గొప్ప నైతిక బలాన్ని ఇచ్చిందని, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్ ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఉద్వేగానికి లోనయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement