హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కే.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఫేజ్2, ఫేజ్ 1 కారిడార్ నెంబర్ 3 ( నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఇవ్వాల (సోమవారం) లేఖ రాశారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల ( 23 స్టేషన్లతో ) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య ( 4 స్టేషన్లతో కూడిన 5 కిలోమీటర్ల మేర ) మెట్రోను మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని కేటీఆర్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి , హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసి వివరించేందుకు సమయం అడిగినట్టు తెలిపిన కేటీఆర్, ఈ విషయంలో మరింత ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున మెట్రో విస్తరణకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ సారథ్యంలో రూపొందించిన ) కేంద్రానికి పంపినట్టు తన లేఖలో పేర్కొన్నారు.
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పడే వృద్ధి కొనసాగుతుందన్నారు మంత్రి కేటీఆర్. భారతప్రభుత్వం, తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అన్న సంగతిని ఈ లేఖ ద్వారా గుర్తుచేశారు. కోవిడ్ తరువాత హైదరాబాద్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరగడం, పూర్తిస్థాయిలో కార్యాలయాలు పనిచేస్తుండడంతో మెట్రోను మరింత విస్తరించాలనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.
ఫేజ్ 1 లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. బీహెచ్ఈఎల్ – లక్డీకాపుల్, నాగోల్ –ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి 8453 కోట్ల రూపాయలవుతుందన్న కేటీఆర్, దీని నిర్మాణాన్ని భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 8453 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి వచ్చే బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.