నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అధునాతన సదుపాయాలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇవ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరం పుడుతాం.. మన కాలపరిమితి ముగిశాక నిష్క్రమిస్తాం. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తేనే చిరస్థాయిగా గుర్తుండిపోతాం. ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. రాష్ట్రంలోనే ఒక వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రామికవేత్తగా ఎదిగారు. అంతేకాకుండా తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని మరిచిపోకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు.
కార్పొరేట్ పాఠశాలల కంటే ఈ స్కూల్ బాగుంది. ప్రధానోపాధ్యాయుడి చాంబర్, టీచర్ల స్టాఫ్‌రూమ్, పిల్లలకు ల్యాబ్స్, భోజనశాల, గ్రౌండ్ అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి వాతావరణం ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా లేదు. పుట్టినగడ్డ రుణం తీర్చుకోవడానికి ఒక విద్యాలయానికి నిధులు సమకూర్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రూ. 7,289 కోట్లతో 26 వేల పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమంతో తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.