డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే.. కడుపు నిండినంతా పనైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఇండ్లను అమ్మే ప్రసక్తే లేదు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. అత్యంత విలువైన 5 ఎకరాల 18 గుంటల స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని తెలిపారు. ఈ భూమి ధర గజానికి రెండున్నర లక్షలు ఉంటుందన్నారు. రూ. 350 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని హౌసింగ్ బోర్డు నుంచి జీహెచ్ఎంసీకి అప్పగించారని తెలిపారు. ఇక్కడున్న నిరుపేదలకు ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఆ మేరకు ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఇల్లును ఒక ప్రయివేటు బిల్డర్ నుంచి కొంటే రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు అవుతోందన్నారు. ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఉదయం ట్విట్టర్‌లో ఈ ఫోటోలు పెడితే మిగతా రాష్ట్రాల ప్రజలు విపరీతంగా స్పందింస్తున్నారు. తమకు కూడా ఇలాంటి ఇండ్లు కట్టించే సీఎం ఉంటే బాగుండు అని అంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు అని అంటున్నారు. రూపాయి కూడా తీసుకోకుండా ఇలాంటి ఇండ్లు కట్టిస్తున్నారా అని సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు.
ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడు అని పెద్దలు అంటుంటారు. అలా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం. ఈ ఇండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని లబ్దిదారులు సంబురంగా చెప్తున్నారు. ఇంతకు మించిన తృప్తి రాజకీయంలో దేనితో కూడా రాదు. కడుపు నిండినంతా పనైంది. సీఎం కేసీఆర్‌కు తప్పకుండా రుణపడి ఉంటాం. మీ అందర్నీ కేసీఆర్ కోటీశ్వర్లను చేశారు. ఈ ఇండ్లను అమ్మే ప్రసక్తే లేదు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. విద్యుత్, నీటి సరఫరా ఏర్పాటు చేశామన్నారు. ఈ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలి అని కేటీఆర్ సూచించారు.