Tuesday, November 26, 2024

2DG డ్రగ్ విషయంలో ఎవరూ మోసపోవద్దుః కేటీఆర్

కరోనా బాధితుల కోసం డీఆర్‌డీవో, రెడ్డీస్ ల్యాడ్స్ సంయుక్తంగా తయారు చేసిన 2డీజీ (2 డిఆక్సీ డీ గ్లూకోజ్) డ్రగ్ ను ఇటీవల కేంద్రం ఆవిష్కరించింది. దీంతో ఈ డ్రగ్ కోసం కరోనా బాధితులు, వారి బంధువులు కొందరు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి ఈ డ్రగ్ కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 2డీజీ డ్రగ్ పై రెడ్డీస్ ల్యాబ్స్ చేసిన ప్రకటనను ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో, డీఆర్‌డీఓ విడుదల చేసిన 2డీజీ మందుపై వైద్య నిపుణులు దృష్టి సారించారు. త్వరలోనే కరోనా చికిత్సలో దీన్ని చేర్చే అవకాశాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సోమవారం 2-డీజీ డ్రగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యాంటీ కోవిడ్ డ్రగ్‌ పూర్తి పేరు.. 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్. ఈ మందుల మొదటి బ్యాచ్‌ను ఇప్పటికే విడుదల చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. సంస్థకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ల్యాబ్.. 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

2డీజీ డ్రగ్‌ ను ఇంకా మార్కెట్‌ లోకి తీసుకురాలేదని రెడ్డీస్ ల్యాబ్స్ ఈ ప్రకటనలో పేర్కొంది. జూన్‌లో ఈ డ్రగ్ మార్కెట్‌లోకి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అందుబాటులోకి ఉండొచ్చని తెలిపింది. దీని ధర ఎంతనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఇక 2డీజీ డ్రగ్‌ అమ్ముతామని చెబుతున్న కొందరు ఏజెంట్ల మాటలు నమ్మొద్దని కంపెనీ పేర్కొంది. ఈ డ్రగ్ పేరుతో కొందరు అక్రమ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement