Friday, November 22, 2024

అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా?: ఈటలకు మంత్రి కొప్పుల ప్రశ్న

సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల విమర్శలు చేయడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్ కేబినెట్ లో ఈటలకు ఎప్పుడు కూడా గౌరవం తగ్గలేదని తెలిపారు.  ఈటలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని.. ఆయనకు ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిందని కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే పదవుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గడిచిన నాలుగు ఏళ్ల నుంచి ఈటల అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెడితే 69 ఉద్యమంలో పాల్గొన వారితోపాటు అనేకమంది మమేకం అయ్యారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ 2003 టీఆర్ఎస్ పార్టీలో చేరారని కొప్పుల చెప్పారు.

ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీలో గౌరవం దక్కినా ఈటల విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారని తెలిపారు. పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం అని పేర్కొన్నారు. అసైన్డ్‌ భూములను కొనరాదు.. అమ్మరాదు అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి అసైన్డ్ భూములను ఎందుకు కొన్నారని నిలదీశారు.  

రాజేందర్ కు గౌరవం ఇచ్చారు కాబట్టే మొదట కమలాపూర్ లో టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీతో అనేక రకాలుగా ఈటల లబ్ది పొందారని చెప్పారు. వ్యాపారం అభివృద్ధి కోసం అసైన్డ్ భూములను కొన్నాను అని ఈటెల స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. దేవరయంజాల్ దగ్గర దేవాదాయ భూములు కొన్నట్లు స్వయంగా అంగీకరించారని తెలిపారు. కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. దేవరయాంజల్‌లో దేవాదాయ భూములను ఎందుకు కొన్నారు? అని కొప్పుల ఈశ్వర్‌ నిలదీశారు. ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా సీఎంపై విమర్శలు చేస్తున్నారని.. రెండేళ్లుగా ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల నిప్పులు చెరిగారు. ఎన్ని సార్లు ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన గౌరవం ఎక్కడా తగ్గలేదని చెప్పారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే ఈటెల రాజేందర్ ఉద్దేశమా? అని కొప్పుల ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement