Thursday, November 21, 2024

ధాన్యం కొంటామన్న బీజేపీ నేతలు ముఖం చాటేశారు: మంత్రి జగదీశ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశామలంగా మారిందన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ రైతు దీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు మంచి నీళ్ళు కోసం గోసబడ్డ నల్గొండ జిల్లాలో నేడు ఇంటింటికి భగీరథ నీళ్లు సందడి చేస్తున్నాయని తెలిపారు. నిండిన చెరువులు  గ్రామాలకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయని చెప్పారు. చేపల పెంపకంతో గ్రామాలు ఆర్ధిక పరిపుష్టి సాధించాయన్నారు. దేశానికి మొత్తానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ రాష్ట్రం చేరందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం దశాబ్దాల వెనక్కి పోతున్నదని విమర్శించారు. నల్లధనం వెనక్కి తీస్తానని నమ్మించి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. గుజరాత్ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణలో మాత్రమే కోతలు లేకుండా 24 గంటల కరంట్ ను  అందిస్తున్నామన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్రం తీరుతో రైతులు బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వరి వేయండి కొంటాం అంటూ అమాయక రైతులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. నేడు బీజేపీ నాయకులు మొఖం చాటేశారని ధ్వజమెత్తారు. క్షుద్ర రాజకీయం చేస్తూ బీజేపీ రైతుల జీవితాలతో ఆట అడుతున్నాయని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement