తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జల వివాదంపై మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తోందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి తప్పుబట్టారు. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చాచిన స్నేహ హస్తాన్ని మరిచి, జగన్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి లేఖ రాసే పరిస్థితినే ఏపీ ప్రభుత్వమే తెచ్చుకుందని చెప్పారు. ప్రజలను మోసం చేయడానికే కేంద్రానికి జగన్ లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యను వారే సృష్టించి, మళ్లీ దాన్ని పరిష్కరించమని వారే అడగటం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. కృష్ణా జలాల దోపిడీలో తండ్రి వైఎస్ ను జగన్ మించిపోతున్నారని వ్యాఖ్యానించారు. చట్టపరంగా తమకు ఉన్న హక్కుతోనే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ పథకాల జీవోలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్సార్ కృష్ణా నీళ్లను దోచుకున్నారని ఆరోపించారు. సాగర్ ఎడమ కాల్వ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహం చేశారని మండిపడ్డారు. దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు తెరిపించి.. తెలంగాణ రైతులకు అన్యాయం చేశారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించలేరు అని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది జల విద్యుత్ ఉత్పత్తి కోసమేనని, చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందన్నారు. తప్పు చేసిన వారే లేఖల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
ఇది కూడా చదవండి: కడియంపై కేసీఆర్ లెక్క ఇదేనా?