తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోంచి రాజగోపాల్ రెడ్డి మైక్ లాగేసుకున్నారు.
ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగం కొనసాగిస్తుండగా… రాజగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడవద్దంటూ మంత్రి ప్రసంగాన్ని రాజగోపాల్ అడ్డుచెప్పారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో జగదీశ్‌రెడ్డి చేతిలోని మైక్ లాక్కోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు నినానాదాలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట చోటుచేసుకుంది. ఈ దశలో 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలను పోలీసులు బయటకు పంపించారు. అనంతరం కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కాసేపు బైఠాయించారు. తర్వాత లక్కార నుంచి చౌటుప్పల్ వైపుగా నిరసన ర్యాలీ చేపట్టారు.
ఇది కూడా చదవండి: దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశాలు ఇవి: సీఎం కేసీఆర్ దిశానిర్దేశం