Saturday, November 23, 2024

Nirmal: శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, ప్రతినిధి, జూన్ 25 (ప్రభ న్యూస్) : భారత ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… శివాజీ మహరాజ్ ఒక సాహసవంతమైన వీరుడని, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ముందు నిలబడి యుద్ధాల్లో అన్నిరంగాల్లో గెలిచిన వ్యక్తి శివాజీ మహారాజ్ అని అన్నారు. భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు ఎలానో, ఛత్రపతి శివాజీ మహరాజ్ కూడా అలాగే అందరివాడన్నారు. పూర్తిగా సెక్యూలర్ భావాలతో ఉన్న వ్యక్తి శివాజీ మహరాజ్ అన్నారు. ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తుందని, అటువంటి వాటిని బీజేపీ వెంటనే మానుకోవాలని ఆయన హితవు పలికారు.

మరో వైపు నిర్మల్ నడిబొడ్డున శివాజీ చౌక్ లో రూ.50లక్షలతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది తామేనన్నారు. బీజేపీ శివాజీ మహారాజుని రాజకీయం చెయ్యడం మంచి పద్ధతి కాదని, మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనలేని బీజేపీ నాయకులు అమరుల గురించి మాట్లాడుతున్నారన్నారు. 2001లో తాము 41మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ ఎందరో నాయకులను కలిసి లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 14ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే నిర్మల్ కు జిల్లా సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పాటుతోనే నిర్మల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement