రాష్ట్రంలోని దళితులకు శాశ్వత ఉపాధి కల్పించి వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 100 మంది లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్ల విలువైన దళితబంధు చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని రైతును అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపించిన విధంగానే, దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీయం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదల బతుకుల్లో సమూల మార్పు కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈసారి వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని చెప్పారు. జిల్లాలో నిర్మల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ముధోల్ నియోజకవర్గానికి 100 యూనిట్లు, ఖానాపూర్ నియోజకవర్గానికి 61 యూనిట్లకు దళితబంధు పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరూ ఒకే రకమైన వ్యాపారం కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉన్న వాటిని ఎంచుకుని తాము ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురి ఉపాధి కల్పించేలా ఎదగాలని సూచించారు.