Friday, November 22, 2024

వైఎస్‌ వారసులకి తెలంగాణలో స్థానంలేదు: షర్మిలకు హరీష్‌ రావు కౌంటర్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో పొలిటికల్ ఏంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిలపై మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైఎస్ వారసులకు స్థానం లేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గురించి మాట్లాడితే గొంతునొక్కి, అసెంబ్లీ నుంచి బయటకు పంపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన వారసులమంటూ కొందరు వస్తున్నారని… వారిపట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆంధ్ర తొత్తులకు, అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదన్నారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతోనే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.  కాంగ్రెస్, టీడీపీలు చేయలేని పనులను ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి మంజూరు చేశామని చెప్పారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లక్ష 30 వేలు ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు.

సంగారెడ్డికి కూడా గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పారు గ‌త పాల‌కులు సంగారెడ్డికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ఎక్కువ, ప్రజలలో తక్కువ అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని.. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement