Tuesday, November 26, 2024

హుజూరాబాద్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తా

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బుధవారం వడ్డీ లేని రుణాలు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌ పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్‌లోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళా భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆరు నెలల్లో మహిళా భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాము మాటలు చెప్పే వాళ్ళం కాదు పని చేసేవాళ్ళం అని అన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి అని తెలిపారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు.

వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. 57 ఏళ్లకే పెన్షన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. అభయహస్తం డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తామన్నామన్న హరీష్.. అభయహస్తంతో సంబంధం లేకుండా రూ.2 వేల పెన్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఈటల రాజేందర్‌ కట్టియ్యలేదన్నారు. హుజూరాబాద్‌కు 4 వేల ఇండ్లు మంజూరైతే ఈటల పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. సీఎం కేసీఆర్‌ మాట తప్పని నాయకుడని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక రైతులు అరిగోస పడ్డారని అన్నారు.  కాలేశ్వరం ప్రాజెక్టు వచ్చాక నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయని వివరించారు. రైతుబంధు ద్వారా రెండు పంటలకు ఎకరాకు 5 వేల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ ధర పెంచడంతో దున్నే కూలీ పెరిగిందన్న హరీష్.. నీటి తీరువా రద్దు చేశామన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ కళ్యాణ లక్ష్మి దండుగ అంటున్నారని మండిపడ్డారు. రూ. 50 నుంచి లక్ష లోపు అప్పు ఉన్న వాళ్లకు కూడా అతి త్వరలోనే చేస్తామని మంత్రి హరీష్ వెల్లడించారు. ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొడుతోందన్నారు. కానీ తెలంగాణలో లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చామని,  మరో 60 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఎవరు ఊడగొట్టారో.. ఎవరు ఇచ్చారో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఆహార ఉత్పత్తి పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి హరీష్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement