కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతి సిబ్బందితో టీం ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టీంలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా 95 శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి, వైద్యాధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
అదే విధంగా 15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..