Monday, November 25, 2024

ఇల్లు కట్టుకునే వారికి సర్కారు చేయూత: హరీష్

తెలంగాణలో నిరుపేదలకు సీఎం కేసీఆర్ త్వరలో శుభవార్త చెబుతారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి సర్కారు చేయూత అందిస్తుందని హరీష్ చెప్పారు. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. సిద్దిపేట 8వ వార్డు హనుమాన్‌నగర్‌లో రూ. 15లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీలేని రుణాల మంజూరు విషయంలో ఇబ్బందులు లేకుండా బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

అటు కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హరీష్ సూచించారు. ఏప్రిల్‌ నుంచి కేంద్రం 45 సంవత్సరాల వారికి కూడా టీకా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. అనంతరం తన నివాస గృహాంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సూడా ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, కౌన్సిలర్‌లు వజీర్, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement