మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈటెలకు ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. తానూ కూడా బీసీ బిడ్డనేనని స్పష్టం చేశారు. ఈటెల కంటే తనకే ఎక్కువ ఆత్మగౌరవం ఉందని, ఆయన బెదిరింపులకు భయపడేవాడు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టే ఈటెల ఇన్నాళ్లూ ఆ గౌరవమైనా దక్కిందన్నారు. అసైన్డ్ భూములు కొన్నట్టు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఈటెలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఈటెల తనతో మాట్లాడలేదన్నారు. వ్యక్తిగతంగా పోతే తానూ వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుందని, దానిని ఈటెల తట్టుకోలేడని గంగుల హెచ్చరించారు.
1992 నుంచి చట్టబద్ధంగా తాము గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని గంగుల చెప్పారు. ఈటెల తరహాలో అసైన్డ్ భూములు కొని గోడౌన్లు కట్టి మద్యం షాపులకు ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికీ క్వారీలు నడుస్తున్నాయని, దానిపై సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని మండిపడ్డారు. ఈటెలకు దమ్ముంటే అసైన్డ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. తాను పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే దానికి ఐదింతలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అధికారుల కమిటీ వేసి విచారణ చేయించేందుకు తాను సిద్ధమని, విచారణలో తప్పు చేశానని తేలితే దేనికైనా సిద్ధమని అన్నారు.