తెలంగాణలో పడుతున్న వర్షాలకు నగరాలు, పట్టణాలు అతలాకుతలం అవుతున్నాయి. కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అయితే, ఇన్నాళ్లు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతోనే ఇళ్లల్లోకి వరద చేరుతోందని ప్రజలు భావించే వారు. మిగత పట్టణాల సంగతి పక్కనబెడితే.. కరీంనగర్ వరదలకు అసలు కారణాన్ని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. వరదలకు కాళేశ్వరమే కారణమంటూ ప్రకటించారు.
గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడంతో నగరంలో వర్షాలుపడితే ఆ నీరు నేరుగా గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేదన్న గంగుల.. కాళేశ్వరంతో గత సీజన్ నుంచి అన్ని జలాశయాలు నిండి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందన్నారు. అందుకే చిన్నవర్షం వచ్చిన అది వరదగా మారుతోందని చెప్పారు. గంటలో వరద నీరంతా వెళ్లిపోతుందని.. ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదని స్థానిక ప్రజలకు అభయమిచ్చారు. ప్రకృతి విపత్తులు చెప్పి రావని పేర్కొన్నారు.
కాగా, మంత్రి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక పట్టణాలు వర్షాలకు జలదిగ్భందంలో ఉన్నాయి. దీంతో కాళేశ్వరం నీళ్లు దరిదాపుల్లో కూడా లేని పట్టణాలు కూడా నీట మునిగాయని.. అందుకు కారణం ఏమిటో కూడా ఆయన చెప్తే బాగుండని నెటిజన్లు అంటున్నారు. కాళేశ్వరంతో కరీంనగర్‌లో గ్రౌండ్ వాటర్ పెరిగాయా ? లేక తెలంగాణ అంతటా పెరిగాయా ? చెప్పాలని కోరుతున్నాయి.