Tuesday, November 26, 2024

ప్రైవేటు ఆస్పత్రులకు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రైవేటు ఆస్ప‌త్రులు లాభాపేక్ష‌తో వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా రోగి చనిపోతే డబ్బుల కోసం ఒత్తిడి చేయకుండా, మొదట మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించారు. కొవిడ్‌ తో చ‌నిపోతే డ‌బ్బులు క‌ట్టందే మృత‌దేహాన్ని అప్ప‌గించం అంటూ ఇలా నానా ఇబ్బందుల‌కు గురిచేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్ర‌భుత్వ ఆదేశాలు, జీవోల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. వ్యాపార దృక్పథంతో ప్రజలను వేధించే పద్ధతులను సభ్య సమాజం హర్షించదని పేర్కొన్నారు. నిబంధనల మేరకే ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు వసూలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశించారు. ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంటే ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. రెమిడెసివిర్ లభ్యత లేకుంటే తామే అందించే ఏర్పాటు చేస్తున్నామని, తాము ఇంత గొప్పగా సహకరిస్తున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు కనికరం లేకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అయితే అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇలా చేస్తున్నాయని భావించడంలేదని, కొన్ని ఆసుపత్రులే ఇలాంటి ధోరణులకు పాల్పడుతున్నాయని ఈటల అభిప్రాయపడ్డారు. అవకాశం వచ్చింది కదా… ఇప్పుడే సంపాదించుకుందాం అనే కోణంలో ఆలోచించడం సబబు కాదన్నారు.

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని, సైన్యం సాయంతో ఆక్సిజన్ రవాణా చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం అని, రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆక్సిజన్ వ్యవహారాల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించామని మంత్రి వెల్లడించారు. 10 వేల బెడ్స్‌కు ఆక్సిజ‌న్ స‌దుపాయం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. గాంధీలో అద‌నంగా మ‌రో 400 ఆక్సిజ‌న్ బెడ్లు, టిమ్స్‌లో అద‌నంగా 300, నాచారం ఈఎస్ఐ ఆస్ప‌త్రిలో 350, నిమ్స్‌లో అద‌నంగా మ‌రో 200 ఆక్సిజ‌న్ బెడ్లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా వారంలో మ‌రో 3,500 ఆక్సిజ‌న్ బెడ్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్ల‌డించారు. రోగులు పెరిగినా ఇబ్బంది రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఆస్ప‌త్రుల్లో సిబ్బంది కొర‌త లేకుండా నియామ‌కాలు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారిని ప్ర‌తి నిత్యం రెండుసార్లు ప‌రిశీలించి వాళ్ల ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకోవాల్సిందేన‌ని ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను ఆదేశించామ‌న్నారు. ప‌రిస్థితి తీవ్రంగా ఉంటే ఆస్ప‌త్రికి రిక‌మెండ్ చేయాల‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా ఉన్న ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స కొన‌సాగుతుంద‌ని మంత్రి ఈటల వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement