Friday, November 22, 2024

రెమిడెసివ‌ర్ విష‌యంలో కేంద్రం వివ‌క్ష‌: ‌ఈట‌ల

తెలంగాణ‌ 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్లు ఇస్తే 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనిపై నిరసన తెలుపుతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణకు చెందిన‌ రోగులే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకకు చెందిన‌ రోగులు కూడా చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ లాగే రెమిడెసివిర్‌ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తో మాట్లాడినట్లు చెప్పారు.

రెమిడెసివ‌ర్ పంపిణీ విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌న్నారు. ప‌ది రోజుల్లో గుజ‌రాత్‌కు ఒక ల‌క్షా 63 వేలు, మ‌హారాష్ర్ట‌కు 2 ల‌క్ష‌ల డోసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు 92 వేలు, ఢిల్లీకి 63 వేల డోసుల రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు పంపిణీ చేస్తే, తెలంగాణ‌కు 25 వేల డోసులు మాత్ర‌మే ఇచ్చింద‌న్నారు. క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల కొర‌త రాకుండా చూడాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేర‌కు 2 ల‌క్ష‌ల ఆర్డ‌ర్ ఇచ్చామని చెప్పారు.

గాంధీ ఆసుప‌త్రిలో మొద‌టిసారి  600 మందికిపైగా రోగులు ఐసీయూలో ఉన్నారని వెల్లడించారు. కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు డ‌బ్బులు క‌ట్ట‌ని రోగుల‌ను గాంధీకి పంపుతున్నాయని తెలిపారు రోగుల ప‌రిస్థితి విష‌మిస్తే కూడా కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు గాంధీ ఆసుప‌త్రికి పంపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుప‌త్రులు రోగిని చేర్చుకున్న‌ప్ప‌టి నుంచి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, మంచి వైద్యం అందించాల‌ని మంత్రి ఈటల సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement