Tuesday, November 26, 2024

బీజేపీపై పోరాటం ఆపొద్దు: టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వాళ్లకు మెంటల్ అని, వాళ్ళు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని అన్నారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో బీజేపీ నాయకులు వేయమంటారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో బీజేపీ నేతలను ఉరికిచ్చాలి అని పేర్కొన్నారు.

మొన్నటిదాకా కొనమని చెప్పిన కేంద్ర మంత్రి.. ఇప్పుడు రా రైస్ కొంటమని చెబుతున్నారని అన్నారు. పంజాబ్ తరహాలో ఇక్కడ ఎందుకు కొనరు? అని మంత్రి ఎర్రబెల్లి కేంద్రాన్ని ప్రశ్నించారు. అబద్ధాల బీజేపీ పై పోరాటం ఆపొద్దు అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాజీపేట కోచ్ ఫ్యాకర్టీ రానే రాలేదని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వరని ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అటక ఎక్కిందన్నారు. ఎన్నికల కోసం మొన్నటిదాకా పెంచని పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయని విమర్శించారు.

ఎస్సీల వర్గీకరణకు, అనుమతి ఇవ్వడం లేదన్న మంత్రి ఎర్రబెల్లి.. ఎస్టీల రిజర్వేషన్లు పెంచుకోవడానికి ఒప్పుకోరని, మోటార్లకు మీటర్లు పెడతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రాలో ఒక్కో మోటార్ మీటర్ కు 75 వేల బిల్లు వస్తుందని, బీజేపీని ఏమి చేద్దాం? అని ప్రశ్నించారు. తన అనుభవంతో కెసిఆర్ లాంటి సీఎం ను చూడలేదన్నారు. ఒక్కో నియోజకవర్గానికి దళిత బంధు 1500 మందికి, పెన్షన్లు 14 వేల మందికి, ఏడాదికి 3 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వనున్నామని తెలిపారు. పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నన్ని నిధులు దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. అభయహస్తం నిధులు తిరిగి డ్వాక్రా మహిళలకు ఇస్తున్నామని, ఆ మహిళలకు పెన్షన్లు కూడా ఇస్తున్నామని చెప్పారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, హాస్పిటల్, ప్రతి గ్రామానికి 20 లక్షలు, చిల్పూరు దేవాలయానికి 25 కోట్లు అడిగారు. అవన్నీ పూర్తి చేసుకోనున్నామని వివరించారు. అందుకే అన్ని గ్రామాల్లో సర్పంచులు తీర్మానాలు చేయాలన్నారు.  27న మండల సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయాలని, 30న జిల్లా పరిషత్ లు సమావేశమై కేంద్ర వైఖరికి నిరసనగా తీర్మానాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement