తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీ సభలో అమిత్ షా మాటలన్నీ అబద్ధాలేనని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలని సవాల్ విసిరారు. ‘’విభజన హామీలు ఏమయ్యాయి?. 15 లక్షలు ప్రతి కుటుంబానికి వారి ఖాతాల్లో వేశారా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?’’ అని నిలదీశారు.
సీఎం కేసీఆర్ కృషిని కేంద్రం పొగిడిందని గుర్తు చేశారు. కెసిఆర్ దేశానికి ఆదర్శమైన సీఎం అని పేర్కొన్నారు. మిషన్ భగీరథకి 19 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సూచిస్తే ఇచ్చారా? ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి వచ్చాయని అడిగారు. ఉపాధి హామీకి ఇంతకుముందు 98 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు 73వేల కోట్లకు కుదించారని మంత్రి మండిపడ్డారు. ఉపాధి హామీకి 25 వేల కోట్ల కోత పెట్టారన్నారు. ఉపాధి హామీ అవినీతి రహితంగా రాష్ట్రంలో అమలు అవుతున్నదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిందని గుర్తు చేశారు. అమిత్ షా బోగస్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కేంద్రం నీచమైన కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గిరిజన యూనివర్సిటీకి 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సైనిక్ స్కూల్ కి స్థలం ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. సైనిక్ స్కూల్‌కి 49.32 ఎకరాల స్థలాన్ని ఎల్కతుర్తి గ్రామంలో కేటాయించినట్లు వివిరంచారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ… బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయి? ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీకి 152.36 ఎకరాల స్థలం ఇచ్చామన్నారు. స్థలం కేటాయించాక మొదట యూపీకి, తర్వాత గుజరాత్‌కి తరలించుకుపోయారని ఆరోపించారు. యూరియా మీద సబ్సిడీని 12 వేల 708 కోట్లు తగ్గించారని అన్నారు. మొత్తం 34 వేల 900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారన్న మంత్రి ఎర్రబెల్లి.. రైతులకు వ్యవసాయం భారంగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. విభజన హామీలను కేంద్రం ఏనాడో వదిలేసిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు ఆసల్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నిధులు అడిగినా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఐఎం, కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఒక్కటీ ఇవ్వలేదన్నారు.