Tuesday, November 26, 2024

విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నా 80 వేల 39 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 11 వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల ను క్రమబద్ధీకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి గరిష్ఠ వయో పరిమితి 10 ఏళ్ళు పెంచుదామన్న సీఎం కేసీఆర్ ప్రకటన రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైనదని ఈ వాస్తవాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి కసరత్తు చేసిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తీసుకోవచ్చిన జోనల్ వ్యవస్థ వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గత ఏడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్న  లక్షా 34 వేలు ఖాళీలను నేరుగా భర్తీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో నియామక ప్రక్రియన వెంటనే ప్రారంభం అవుతుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందని అందువల్ల నిరుద్యోగ విద్యావంతులు, విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు హాజరయ్యి ఎంపిక కావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 8 లక్షల 672 వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్ పెన్షన్ల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తుచేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను, నిరుద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ శాఖలలో, సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని అందువల్ల ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ పై బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement