హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిపై బీబీనగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘటన స్థలంలో ఆగారు. జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి అక్కడే నిలబడి సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. వాహనంలో చిక్కుకున్న డెడ్ బాడీలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. మృతులకు సంబంధించిన వారితో మాట్లాడి మంత్రి విచారం వ్యక్తం చేశారు.
పర్వతగిరి మండలం తోటపల్లి కి చెందిన అనిల్ అనే వ్యక్తి ట్రాలీ డ్రైవర్ కాగా, అతను వరంగల్ కు చెందిన ఖలీల్ అనే మరో వ్యక్తితో కలిసి గుడిమల్కాపూర్ కు చెందిన రాజేందర్ రెడ్డి అనే పూల వ్యాపారి దగ్గర పూలు తీసుకొని ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వరంగల్ కు బయల్దేరారు. బీబీనగర్ దాటాక టోల్గేట్ కంటే ముందు ఉన్న ఒక ప్రాంతంలో ఆగివున్న లారీని నాలుగున్నర గంటల ప్రాంతంలో ట్రాలీ ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్ సహా డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి అందులోనే చిక్కు పడిపోయారు. ఆ వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్లపై ప్రయాణించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాద సంఘటనలో అత్యంత బాధాకరంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం, నిద్రలేమి, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ పాటించపోవడం వంటి అనేకానేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఈ అంశాల పట్ల జాగ్రత్త వహించాలని మంత్రి తెలిపారు.