భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు. రెండో అయోధ్యగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వేలాది మంది భక్తజన సందోహనం నడుమ వైభవోపేతంగా ఈనెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణ ఉత్సవం, భక్తులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10న జరగనున్న రాములవారి కల్యాణం, 11న పట్టాభిషేకం నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతారామ కళ్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాలనుండి తరలివచ్చే అశేష భక్తజన కోటికి సకల సౌకర్యాలు కల్పించాలన్నారు.
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కళ్యాణంను ఆలయంకే పరిమితం చేసినందున, ఈ మహోత్సవాలకు ఈ సారి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున 3 లక్షల స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్యశిభిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా.. సాధ్యమైనంత దెగ్గరగా ఉండేలా చూడాలని సూచించారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులొ ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఎర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బ్లీచింగ్ ను ఎప్పటికప్పుడు వెడజల్లుతు పరిశుభ్రత పాటిస్తూ, ors ప్యాకెట్స్ ను ఉచితంగా అందించాలని అన్నారు. ప్రత్యక్షంగా స్వామి వారి కళ్యాణంను తిలకించేందుకు రాలేని వారికోసం వారధిగా ఉన్న మీడియా కు ప్రత్యేక విభాగంను ఎర్పాటు చేసి ప్రసార సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణంకు చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయంలో కల్యాణ మంటపాలకు రంగులు అద్ది మెరుగులు దిద్దాలన్నారు. నిర్దేశించిన పనులన్నీ 8వ తేదీ కల్లా శ్రీరామ నవమి పనులు పూర్తచేయాలని, మిథిలా స్టేడియంలో, మూడవీధులు, స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే వివిఐపి భద్రత కోరకు CRPF బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులను కూడా వినియోగించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచికలు, కళ్యాణం ప్రాంగణ వివరాలు, వివిధ సేవలకు సంబందించిన పలు అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి కల్యాణం జరిగే చోటు అయిన మిథిలా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.