త్వరలోనే మినీ వర్షన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పట్టాలపైకి తీసుకురానుంది మోడీ ప్రభుత్వం. ఈ సెమీ- హైస్పీడ్ మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కేవలం 8 బోగీలు మాత్రమే ఉంటాయి. అలాగే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సగం అంటే 4-5 గంటలు మాత్రమే ప్రయాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 16 బోగీలు ఉంటాయి. ప్రధాన నగరాల మధ్య వీటిని నడుపుతున్నారు. ఈ రైళ్ల ప్రయాణ సమయం సుమారు 6-7 గంటలు.
అయితే, మినీ వర్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తక్కువ దూరాలు కేవలం 4-5 గంటల సమయం ప్రయాణం ఉండేలా తీసుకువచ్చే యోచనలో ఉంది కేంద్రం. చిన్న చిన్న సెక్టార్లు, ప్రయాణికుల లోడ్ తక్కువగా ఉండే మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉదాహరణకు అమృత్‌సర్ నుంచి జమ్ము, కాన్పూర్ నుంచి ఝాన్సీ, నాగ్‌పూర్ నుంచి పూణె వంటి మార్గాలు ఉంటాయి. 2023, మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో పైలట్ ప్రాజెక్టు కింద తొలి మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలు ఎక్కించేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే, దేశవ్యాప్తంగా మినీ వందే భారత్ రైళ్లను తీసుకురానుంది రైల్వే మంత్రిత్వ శాఖ.