తెలంగాణలో ఓ సర్వే సంచలన నిజాలు వెల్లడిస్తోంది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపట్లేదని అధికారులు పదే పదే చెబుతున్నా.. వాస్తవంగా పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ సర్వే చేసింది కూడా స్వయానా ప్రభుత్వమే. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఎంతమందికి ఉన్నాయని తెలుసుకోవడానికి ఫీవర్ సర్వే చేయించింది. అయితే ఇందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
రాష్ట్రంలో కరోనా టెస్టులు అందరికీ చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఈనెల 6 నుంచి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి ఒకరు మొత్తం నలుగురితో కమిటీలను వేసింది. ఒక్కో కమిటీ కనీసం వెయ్యి మందిని పరీక్షించింది. కరోనా లక్షణాలున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నట్టు ఈ సర్వే సంచలన నిజాలు తెలిపింది. కేవలం హైదరాబాద్‌లోనే 31వేల మందికి జ్వరాలు, దగ్గు, జలుబు ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారు లక్షల్లోనే ఉన్నట్టు గుర్తించింది. పది మందిలో ఒకరికి కచ్చితంగా లక్షణాలు ఉన్నాయని వివరించింది. అయితే లక్షణాలున్న వారందరూ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, ఇతర విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చి పోతున్నారు. దీంతో తమకు అసలు కరోనా ఉందో లేదో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు.