తమిళనాట ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచారంలో జోరు పెంచారు. అయితే, ఎన్నికల హడావుడిలో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న ప్రసంగాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఉద్దేశించి డీఎంకే నేత దిండిగల్ లియోని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళలను ఆవులతో పోల్చిన దిండిగల్.. విదేశీ ఆవులు ఇచ్చే పాలను తాగి వారు పీపాల్లా తయారవుతున్నారని లియోని వ్యాఖ్యానించారు.
డీఎంకే ప్రచార కార్యదర్శి అయిన దిండిగుల్ లియోని.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ డీఎంకే అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తొండముథుర్ డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి తరఫున దిండిగుల్ లియోని ఈ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, శివసేనాపతి స్థానిక పశువుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్జీఓ సంస్థ. ‘సేనాపతి కంగయం పశువుల పరిశోధన ఫౌండేషన్’ మేనేజింగ్ ట్రస్టీ. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలలనే ఉద్దేశంతో ప్రసంగించిన దిండిగల్ లియోని.. చివరికి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘’మన వద్ద చాలా రకాల ఆవులు ఉన్నాయి. మన వ్యవసాయ క్షేత్రాల్లో విదేశీ ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆవులకు చాలా డిమాండ్ ఉంది. పాలు పితకడం కోసం వాటికి మిషిన్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి స్విచ్ వేయగానే.. గంటలోపలు 40 లీటర్ల పాటు పితుకుతాయి. ఈ విదేశీ ఆవుల పాలు తాగి మన వద్ద మహిళలు బెలూన్‌లా ఉబ్బిపోతున్నారు. గతంలో మహిళలు 8 ఆకారంలో ఉండేవారు. ఇప్పుడు డ్రమ్ముల్లా మారిపోతున్నారు. గతంలో పిల్లలను అలవోకగా నడుమొంపుల్లో ఎత్తుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. విదేశీ ఆవుపాలు తాగి మహిళలు లావుగా తయారవుతున్నారు. పిల్లలు కూడా అలాగే మారిపోతున్నారు.’’ అంటూ దిండిగుల్ లియోని మహిళలపై వ్యాఖ్యానించారు.
దిండిగల్ లియోన్ ప్రసంగానికి సంబంధించి వీడియోను పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో తమిళనాట పెనుదుమారం రేపుతోంది. మహిళలను అవమానిస్తారా? అంటూ ధ్వజమెత్తుతున్నారు నెటిజన్లు. వివాదస్పద వ్యాఖ్యలతో కూడిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు లియోనిని చెడుగుడు ఆడారు.
డీఎంకే నేత వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి నేతలపై వేటు వేయాలని డీఎంకే అగ్రనేతలకు సూచించారు. లియోని వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ నేత గాయత్రి రఘురామ్ ఆక్షేపించారు. మహిళలపై నిస్సిగ్గుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన ఏం పాలు తాగుతారని ప్రశ్నించారు. గర్భం దాల్చిన అనంతరం మహిళ శరీరంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా..? హార్మోన్ల మార్పుల ప్రభావంపై అవగాహనా ఉందా..? అని నిలదీశారు.