మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. సుమారు 15వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో పూణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్త కేంద్రం సేవల్ని అందించనున్నది. క్లౌడ్, ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడెక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్‌లో సర్వీసులు ఇవ్వనున్నది. వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్, డెవలపర్స్, ఎడ్యుకేషన్, గవర్నెమంట్ సంస్థలకు ఈ సేవలు అందనున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల ఇండియాలో కొత్తగా 15 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఓ స్టడీ ద్వారా తేలింది. దీనికి తోడు 1,69,000 కొత్త ఐటీ జాబ్స్ కూడా ఇచ్చారు.
ప్రజలు, వ్యాపారుల పట్ల ఉన్న నిబద్ధత వల్ల ప్రపంచంలో ఇండియా డిజిటల్ లీడర్‌గా ఎదుగుతోందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో డిజిటల్ ఎకానమీలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. దీని ద్వారా పెట్టుబడులు పెరగనున్నాయి. అన్ని పరిశ్రమలు, రంగాల్లోనూ క్లౌడ్ కీలకంగా మారుతోందన్నారు. హైదరాబాద్‌ను డేటాసెంటర్‌గా ఎంపిక చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్ణయం పట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ అవుతుందని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందని, హైదరాబాద్‌లో అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను ఆ కంపెనీ ఓపెన్ చేయడం సంతోషకరమని, తెలంగాణ-మైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. డేటా సెంటర్ వల్ల స్థానిక కంపెనీలకు క్లౌడ్ సర్వీసులు పెరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్‌ను మైక్రాసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి ప్రశంసించారు.