తెలుగువారి కీర్తిపతాక జాతీయస్థాయిలో మరోసారి రెపరెపలాడుతోంది. దేశ సర్వోన్నత న్యాయపీఠాన్ని తెలుగు న్యాయమూర్తి అధిష్ఠించారు. సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ రమణకు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వివిధ పక్షాల నేతలు, ఎంపీలు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాభినందనలు తెలిపారు. ‘‘మన తెలుగు తేజం ఎన్.వీ రమణగారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.