టాలీవుడ్ సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) సంస్థ తరఫున 45 ఏళ్లకు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితం వ్యాక్సిన్లను అందిస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసల జల్లు కురిపించారు. అపోలో సహకారంతో సినీ కార్మికులు, జర్నలిస్టులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని చిరంజీవి ప్రకటన చేయడం గురించి తెలుసుకుని సంతోషించానని చెప్పారు. సమాజం పట్ల ఆయన చూపిస్తోన్న బాధ్యత ప్రశంసనీయమని చెప్పారు.
తమిళిసై చేసిన ట్వీట్ కు చిరంజీవి స్పందించారు. ‘గవర్నర్ తమిళిసై మేడమ్ గారికి సీసీసీ తరఫున కృతజ్ఞతలు. సీసీసీ ద్వారా సాయం చేస్తోన్న వారందరికీ మీ ప్రశంసలు ప్రోత్సాహాన్ని అందిస్తాయి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా, గత ఏడాది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించిన కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయి.. వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అలాంటి వారిని ఆదుకొనేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విరాళాలు సేకరించి.. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు అండగా నిలిచారు. లాక్ డౌన్ ముగిసినప్పటికీ సీసీసీ ద్వారా ఇంకా సరైనా ఉపాధి లేని సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికి కోవిడ్ టీకా వేస్తున్నారు. దశల వారిగా అర్హులైన వారందరికీ టీకాను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సీసీసీ తరఫున సినీ కార్మికులు అందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని చిరంజీవి ప్రకటించారు. అపోలో 24/7 సహకారంతో సినీ కార్మికులతో పాటు సినీ జర్నలిస్టులకు కూడా ఉచితంగా టీకా అందజేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.