న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ మొబైల్ వాహనాల ద్వారా లబ్దిదారుల ఇంటికే తీసుకెళ్లి వారి సమక్షంలోనే తూకం వేసి ఇతర సరుకులతో పాటు అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పంపిణీ, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పౌర సరఫరా శాఖ మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల శాఖ చేపడుతున్న చర్యలను మంత్రి నాగేశ్వరరావు సమావేశంలో వివరించారు.
గోడౌన్లు, రైస్ మిల్లులు, రవాణా, ధాన్యం సేకరణలో అక్రమాలు జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థతో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పినట్టు తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రంలోని గోడౌన్లు, రైస్ మిల్లులు, రవాణా వాహనాల కదలికలను ఒకేచోట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మానిటరింగ్ చేస్తామని వివరించారు. మొబైల్ వాహనాల కదలికలు, లబ్దిదారులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు నేరుగా నిత్యావసర వస్తువుల పంపిణీని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్టు మంత్రి కారుమూరు సమావేశంలో వెల్లడించారు.