Tuesday, November 19, 2024

TS | ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్‌ ఎన్నారైల భేటీ.. మహిళా బిల్లుపై శుభాకాంక్షలు తెలిపిన బృందం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటఫలితమేనని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ ఆర్‌ఐల బృందం ప్రశంసించింది. బిల్లును సాధించినందుకు కవితకు బృందం శుభాకాంక్షలు తెలియజేసింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల ప్రచారం ,ఎన్నికల ప్రణాళికను కవితకు వివరించారు. ఎమ్మెల్యే మహేష్‌ బిగాల ఆధ్వర్యంలో బుధవారం బిఆర్‌ఎస్‌ యూఎస్‌ఎ అడ్విసోరి చైర్‌ మహేష్‌ తన్నీరు, కన్వీనర్‌ చందుతల్లా, హరీష్‌ రెడ్డి, సురేష్‌ తదితరులు కవితను ఆమె నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా మహేష్‌ తన్నీరు, చందు తల్లా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాసులు బీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచార మాధ్యమాల ద్వారా తీసుకువెళతామని కవితకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి ఎన్నికల ప్రచార ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రానున్నారని తెలిపారు. సోషల్‌ మీడియా , టెలిఫోనిక్‌ క్యాంపెయిన్‌తో ప్రజల్లోకి దూసుకుపోతామని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లను సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేశారని కవితను అభినందించారు. ఇదే పోరాట పటిమతో చట్ట సభల్లో అమలయ్యే విధంగా పోరాటం కొనసాగించాలని కోరారు. ఓబీసీలకు చట్ట సభల్లో 33 శాతం సాధించేందుకు మరో పోరాటం చేపట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement