హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: భగభగ మండి పోతున్న ఇంధన ధరల ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు పెరిగి ఆందోళనతో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలపై మరో కోణంలో బాదేందుకు కేంద్ర సర్కారు సిద్దమైంది. నిత్యం చిన్నా, చితకా జబ్బులకు వాడే మందులు మొదలుకుని ఖరీదైన వైద్యంతో కూడిన వ్యాధుల వరకు వాడే మందుల వరకు భారీగా పెంచేందుకు నిర్ణయించింది. దాదాపు ఐదేళ్ళ తర్వాత మందుల ధరలు ఒక్కసారిగా పెంచాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకముందే మందుల ధరలు భారీగా పెరుగుతున్నాయన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ- (ఎన్‌పీపీఏ) చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్ నెల మొదలుకుని పెరిగిన మందుల ధరలు అమల్లోకి రానున్నాయి. ఫార్మా కంపెనీల ఒత్తిడికి తలొగ్గి నరేంద్రమోడీ ప్రభుత్వం మందుల ధరల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాజకీయ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది జనవరి మొదలుకుని మందుల ధరలు పెంచాలని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పలుమార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
ఎన్‌పీపీఏ సమాచారం మేరకు, ఇప్పుడున్న మందుల ధరలు 12 శాతానికి పైగా పెరుగనున్నాయి. షెడ్యూల్డ్ ఔషధాల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగే వాటిలో నొప్పి నివారణ, యాంటీ-బయాటిక్స్, గుండెకు సంబంధించినవి, క్షయ, ఇతర వ్యాధులకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్మాస్యూటికల్ కంపెనీల విలువను నిర్ణయించే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ- (ఎన్‌పీపీఏ) ఈ పెరుగుదలకు సంబంధించి అంతర్గత మార్గదర్శకాలను విడుదల చేసింది. వార్షిక టోకు ధరల సూచిక ప్రకారం, ఔషధ కంపెనీలు మందుల ధరలను పెంచనున్నాయి. నిత్యావసర ఔషధాల ధరలు 12 శాతం పెరుగుతాయని ఔషదరంగ నిపుణులు అంచనా వేశారు. ఇది ఎన్నడూ లేని విధంగా వార్షిక ధరల పెరుగుదలగా వారు చెబుతున్నారు. వెయ్యి కంటే ఎక్కువ నిత్యం అవసరమైన మందులు, మరో 384 ఖరీదైన ఔషధాల ధరలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం)లో జాబితా చేయబడిన ఔషధాల ధరలలో వార్షిక పెంపుదలలు డబ్లూపీఐ ఆధారంగా ఉంటాయి. ఈ మందులను రిటైల్ వినియోగదారులకు నేరుగా విక్రయించడమే కాకుండా వివిధ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ- అధికారులు గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మధ్య కాలంలో 12.12 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారు కార్యాలయాన్ని ఉటంకిస్తూ తెలిపారు. పెరుగనున్న ఔషధాలలో జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్‌లు వంటివి ఉన్నాయి. అత్యవసర జాబితాలో ఉన్న 800 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం ఏకంగా 12.12శాతం పెంచింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్‌పీపీఏ) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. నిత్యావసర ఔషధాల ధరలు 10 శాతానికి పైగా పెరగడం ఇది వరుసగా రెండో సంవత్సరం అని కూడా తెలిపింది. గతేడాది ఈ మందుల ధరలు వార్షికంగా 11 శాతం పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో, కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఈఎం 2022ని విడుదల చేసింది. ఇందులో 27 చికిత్సా వర్గాలలో 384 మందులు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం విడుదల చేసిన మునుపటి జాబితాను భర్తీ చేసిన జాబితాలో దేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే కొన్ని ఔషధాలు ఉన్నాయి.
ఎన్‌ఎల్‌ఈఎం మందులు జ్వరం, మధుమేహం, ఇన్ఫెక్షన్, హృదయ సంబంధ వ్యాధులు, రక్త సంబంధిత రుగ్మతలు, క్షయ, రక్తపోటు-, చర్మ వ్యాధులు వంటి సాధారణ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్లు, రక్తహీనత వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. ఇందులో పారాసెటమాల్, అజిత్రోమైసిన్ వంటి యాంటీ-బయాటిక్స్, అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్లు మరియు మినరల్స్ వంటి యాంటీ- ఎనీమియా ప్రిస్కిప్ష్రన్‌లు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో అందుబాటు-లో ఉన్న దాదాపు 6,000 ఫార్ములేషన్లలో, దాదాపు 18 శాతం షెడ్యూల్ చేయబడిన మందులు ధరలు పెరిగే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, కరోనరీ స్టెంట్‌లు, మోకాలి ఇంప్లాంట్లు- వంటి అనేక వైద్య పరికరాలు కూడా ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం వాటి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నట్లు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. 2022కి ముందు, ఈ ఔషధాల ధరలు కేవలం 2-3 శాతం మాత్రమే పెరిగేవి. అరుదుగా 4 శాతానికి మించి ఉండేవని పరిశ్రమలోని వ్యక్తులు, నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు మరియు క్రియాశీల ఔషధ పదార్ధాల ధరల నేపథ్యంలో ఈ నిబంధనను సడలించాలని పరిశ్రమ డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాన్-షెడ్యూల్డ్ ఔషధాల ధరలు 10 శాతం వరకు పెరగనున్నాయి.
నెలకు రూ.10 కోట్ల భారం అంచనా
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేని ప్రజలను ఔషధాల ధరలు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1.20 కోట్ల జనాభా ఉండగా దాదాపు 30 లక్షల కుటు-ంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 80లక్షల నుంచి 90 లక్షల మంది వివిధ రుగ్మతలతో బాధపడుతున్నట్టు- వివిధ సంస్థలు నిర్వహించిన పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతి కుటు-ంబం నెలకు సగటు-న రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు మందులకే వెచ్చిస్తున్నది. ఈ లెక్కన ఔషధాల ధరల పెంపుతో ఆయా కుటుంబాలపై ఎంతలేదన్నా నెలకు రూ.400 నుంచి రూ.500 వరకు అదనపు భారం పడనున్నది. నెలకు ప్రజలపై ఔషధ భారం రూ.10 కోట్ల వరకు ఉంటు-ందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధరలు పెరుగనున్న మందుల్లో కొన్ని..
జ్వరం మందులు (పారాసిటమాల్ వంటివి)
యాంటి బయోటిక్స్ (అజిత్రోమైసిన్ వంటివి)
అంటు-వ్యాధులు
గుండె సంబంధిత వ్యాధులు
రక్తపోటు- (బీపీ)
డయాబెటిస్ (షుగర్)
చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు
రక్తహీనత (ఫోలిక్ యాసిడ్ వంటి ఔషధాలు)
రక్తప్రసరణ సంబంధిత జబ్బులు
క్షయ (టీ-బీ)
వివిధ రకాల క్యాన్సర్లు
మినరల్, విటమిన్ తదితర గోళీలు
మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్‌లు