నీట్ పీజీ కౌన్సెలింగ్ పై రచ్చ కొనసాగుతూనే ఉంది. నేడు కూడా అదే ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని సప్దర్ జంగ్ హాస్పటల్ నుంచి సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లుతున్న వైద్యులను, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురు డాక్టర్స్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. నిరసన తెలుపుతున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులు హాస్పటల్ లోని ప్రధాన గేట్లను మూసి వేశారు. దాంతో లోపలే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డాక్టర్స్ ఆందోళన కొనసాగించారు. పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించిన వైద్యులు.. ఈ ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) పిలుపునిచ్చింది.
నేటి ఉదయం 8 గంటల నుంచి అన్ని రకాల వైద్య సేవలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే, రెసిడెంట్ వైద్యులతో పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ.. రెసిడెంట్ వైద్యుల సంఘం సమాఖ్య(ఎఫ్‌ఓఆర్‌డీఏ) మంగళవారం నుంచి అన్ని వైద్య సంస్థల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఎఫ్‌ఏఐఎంఏ) బుధవారం ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో దేశ రాజధానిలోని పలు ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, వైద్యులను నిర్బంధించడాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌వోఆర్‌డీఏ) తీవ్రంగా ఖండించింది. ఘటన జరిగిన రోజు మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా పేర్కొంది.నీట్ పీజీ 2021 ప్రవేశాల విషయంలో జాప్యంపై నెల రోజులుగా నిరసన తెలుపుతున్న పలువురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..